Srimad Valmiki Ramayanam

Balakanda Sarga35

Story of Ganga and Parvati !

With Sanskrit text in Telugu , Kannada and Devanagari,

ఉపాస్య రాత్రిశేషం తు శోణాకూలే మహర్షిభిః|
నిశాయాం సుప్రభాతాయాం విశ్వామిత్రోsభ్యభాషత ||

తా|| మిగిలిన రాత్రి ఆ శోణానదీ తీరమున ఆ మహర్షులతో గడిపి రాత్రి తరువాత సుప్రభాత సమయములో విశ్వామిత్రుడు ఇట్లు పలికెను.

బాలకాండ
ముప్పదిఇదవ సర్గము
( గంగా పార్వతుల కథ )

మిగిలిన రాత్రి ఆ శోణానదీ తీరమున ఆ మహర్షులతో గడిపి రాత్రి తరువాత సుప్రభాత సమయములో విశ్వామిత్రుడు ఇట్లు పలికెను.

'ఓ రామా! రాత్రి గడిచినది సుప్రభాత పూర్వ సంధ్యాసమయమైనది. లెమ్ములెమ్ము.నీకు శుభమగుగాక. ప్రయాణమునకు సిద్ధము కమ్ము'.

ఆ మాటలను విని ఉదయపు కార్యక్రమములను నిర్వర్తించి , ప్రయాణమునకు సిద్ధమై రాముడు ఇట్లు పలికెను. ' ఈ శోణానది శభమైన జలములతో లోతుగా విలసిల్లు చున్నది. ఓ బ్రహ్మన్ ! మనము ఏవిధముగా ఈ నదిని దాటవలయును' అని. ఈ విధముగా పలికిన రామునితో విశ్వామిత్రుడు ఇట్లు చెప్పెను."ఇచట మహర్షులు పయనించు మార్గము అదృష్టవశాత్ నాకు తెలుసును". ధీమంతుడైన విశ్వామిత్రుని వచనములను విని ఋషులందరూ అదే మార్గమున వివిధరకములైన వనములను చూచుచూ కొనసాగిరి. వారందరూ మద్యాహ్నమువఱకూ ప్రయాణము చేసి అత్యుత్తమమైన గంగానదీ తీరమునకు చేరిరి. ఆ హంసలతో ఇతర పక్షులతో సేవించబడుచున్న ఆ పుణ్యమైన జలములను చూచి ఆ రామునితో సహా మునులందరూ మహదానందపడిరి. అంతట వారు ఆ తీరములో ఒక ప్రదేశమును నివాసయోగ్యముగా చేసికొని , స్నానము చేసి యథావిధిగా పితృదేవతలకు తర్పణములిచ్చిరి. అగ్నికి హవిస్సులు సమర్పించి హవిషాన్నమును అమృతమువలె సేవించి ఆ జహ్నవీ తీరములో వారందరూ అత్యంత సంతోషపడిరి. అప్పుడు మహాత్ముడైన విశ్వామిత్రుని చుట్టూ వారందరూ కూర్చుని ఉండిరి

అప్పుడు శ్రీరాముడు విశ్వామిత్రుని ఇట్లడిగెను.

'భగవన్ ! గంగానది మూడులోకములలో ప్రవిహించునట్టి త్రిపథగా ఏట్లు పేరుపొందినది ? ఏవిధముగా నదులకు పతి యగు సాగరుని చేరినది?' అని.

రామునిచే చెప్పబడిన ఆ మాటలను విని మహామునియగు విశ్వామిత్రుడు, గంగానదియొక్క జన్మ మరియూ వృద్ధి గురించి చెప్పసాగెను. 'ఓ రాఘవా ! పర్వతములలో ఇంద్రునివంటి హిమవాన్ అను పేరుగల, అనేక ధాతువులతో సమ్మిళితమైన ఒక పర్వతము కలదు. ఆ హిమవంతమునకు అప్రతిమమైన రూపములుగల కుమార్తెలు ఇద్దరు ఉండిరి. మేరువు యొక్క సుందరమైన కుమార్తె మైనా హిమవంతుని భార్య . అతనికి ప్రియురాలు. ఆ హిమవంతుని కి గంగా జ్యేష్ఠ పుత్రి . ఉమా అనబడు ఆమె రెండవపుత్రి . అంతట దేవతలందరూ దేవతార్థము కొఱకై జ్యేష్ఠ కుమార్తె యగు గంగను తమకు ఇవ్వమని ఆ శైలేంద్రుని అడిగిరి. ధర్మాత్ముడైన హిమవంతుడు లోకపావని నిరాటంకముగా సాగిపోవునట్టి తన తనయను మూడు లోకముల హితము కొఱకు దేవతలకిచ్చెను.
ఆ గంగను ప్రతిగ్రహించి ఆ దేవతలు తాము కృతార్థులైనట్లు భావించి వెళ్ళిపోయిరి'.

'ఓ రఘునందనా ! ఆ శైలెంద్రుని రెండవ కుమార్తె చాలా తీవ్రమైన వ్రత నిష్ఠతో తపస్సు చేసెను. అట్లు తీవ్రమైన తపస్సు చేసిన ఆ ఉమను హిమవంతుడు లోకములచే నమస్కరింపబడు రుద్రునకు ఇచ్చెను'.

'ఓ రాఘవా ! ఈ వి్ధముగా ఆ శైలేంద్రుని పుత్రికలు ఇద్దరూ నదులలో శ్రేష్ఠమైన గంగ , మరియూ ఉమాదేవి లోకములో పూజ్యులైరి.'

' ఓ రామా ! త్రిపథగా గంగ ప్రథమముగా ఏట్లు వెళ్ళినదో ఈ విథముగా విశదీకరించితిని. ఆనాడు హిమవంతునికి కుమార్తెగా జన్మించి సురలోకమునకు చేరిన నదియే ఈ పుణ్యప్రదమైన గంగా నది'

|| ఈ విధముగా వాల్మీకి రామాయణములోని బాలకాండలో ముప్పది ఇదవసర్గ సమాప్తము ||

||ఓమ్ తత్ సత్ ||

సైషా సురనదీ రమ్యా శైలేంద్రస్య సుతా తదా |
సురలోకం సమారూఢా విపాపా జలవాహినీ ||
'ఆనాడు హిమవంతునికి కుమార్తెగా జన్మించి సురలోకమునకు చేరిన నదియే ఈ పుణ్యప్రదమైన గంగా నది'

||ఓమ్ తత్ సత్ ||